Steve Smith: వార్నర్, స్మిత్‌లకు ప్రాణాపాయం..!
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్‌ను ఉగ్ర నీడ వెంటాడుతోంది. ఇప్పటికే ఇంధన సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు, ఇప్పుడు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లకు అక్కడి ఉగ్రమూకలు చేసిన హెచ్చరికలు సంచలనంగా మారాయి. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లక్ష్యంగా పాక్ ఉగ్రవాదులు హెచ్చరికలు చేయడం అంతర్జాతీయ క్రీడా ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనితో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆశలపై ఉగ్రవాదం నీళ్లు చల్లినట్లు అయింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లను, ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లను లక్ష్యంగా “వెంటనే పీఎస్ఎల్ నుంచి తప్పుకోండి.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అంటూ హెచ్చరించారు. పాకిస్థాన్‌లోని ఒక స్థానిక ఉగ్రవాద ముఠా సోషల్ మీడియా ద్వారా ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వార్నర్, స్మిత్ వంటి అంతర్జాతీయ స్టార్లను టోర్నీ నుంచి తప్పుకోవాలని, లేనిపక్షంలో వారి భద్రతకు తాము గ్యారెంటీ ఇవ్వలేమని ఆ ముఠా పేర్కొంది.
ఇవి కూడా చదవండి
పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో భాగంగా, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు ఈ ముఠా క్రికెటర్లను టార్గెట్ చేసినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనితో లాహోర్, కరాచీలలో ఆటగాళ్లు బస చేసే హోటళ్లు, స్టేడియాల వద్ద పాక్ సైన్యం ‘కమాండో’ స్థాయి భద్రతను ఏర్పాటు చేసింది. ఈ బెదిరింపుల తర్వాత డేవిడ్ వార్నర్(David Warner), స్టీవ్ స్మిత్ తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు విదేశీ ఆటగాళ్లు లీగ్ నుంచి తప్పుకుని స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి.
తమ ఆటగాళ్ల భద్రత విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైతే ఆటగాళ్లను వెనక్కి పిలిపిస్తామని స్పష్టం చేసింది. ఒకవైపు దేశంలో పెట్రోల్ కొరత కారణంగా స్టేడియాల్లోకి ప్రేక్షకులను నిషేధించగా, ఇప్పుడు ప్లేయర్లకు ప్రాణహాని ఉందనే వార్తలు.. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి పెద్ద తలనొప్పిగా మారింది. పీఎస్ఎల్ 2026 అసలు పూర్తవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో శ్రీలంక జట్టుపై జరిగిన దాడి తర్వాత పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ కు చాలా కాలం పాటు బ్రేక్ పడింది.
ఇవి కూడా చదవండి








