బుమ్రాకు ఏమైంది..? 5 మ్యాచ్‌లు.. 0 వికెట్లు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టుకు స్టార్ బౌలర్ బూమ్రా ఫాం ఒక భారీ షాక్ లాంటిదే. ఆ జట్టు ప్రధాన బౌలర్, ప్రపంచ అత్యుత్తమ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్లోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా, ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టే బుమ్రా, ఈసారి వికెట్ల కోసం చెమటోడ్చాల్సి వస్తోంది.
ఈ సీజన్ లో బుమ్రా ఇప్పటివరకు మొత్తం 19 ఓవర్లు వేసి 164 పరుగులు సమర్పించుకున్నాడు. అతని ఎకానమీ రేటు 8.63గా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో(DC) జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 పరుగులే ఇచ్చి కట్టడి చేసినప్పటికీ, వికెట్ మాత్రం దక్కలేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ తో.. 10.67 ఎకానమీ, పంజాబ్ కింగ్స్ పై(PBKS).. 10.25 ఎకానమీతో బౌలింగ్ చేసి.. ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఐదు మ్యాచుల తర్వాత కూడా బుమ్రా వికెట్ల కాలమ్ ‘సున్నా’ గా ఉండటం ముంబై ఇండియన్స్ యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
బుమ్రా వైఫల్యం వెనుక ప్రధానంగా అతని బౌలింగ్ శైలిలో వచ్చిన మార్పులే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సీజన్లో బుమ్రా దాదాపు 44 శాతం బంతులను ‘స్లోయర్ డెలివరీలు’గా వేస్తున్నాడు. పేస్ తగ్గించి బ్యాటర్లను బోల్తా కొట్టించాలనుకున్న అతని వ్యూహం బెడిసికొడుతోంది. మరోవైపు, ప్రత్యర్థి బ్యాటర్లు బుమ్రా ఓవర్లలో వికెట్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడుతూ, మిగిలిన బౌలర్లను టార్గెట్ చేస్తున్నారు. పవర్ ప్లేలో ఇతర బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో బుమ్రాపై ఒత్తిడి పెరుగుతోంది.
జస్ప్రీత్ బుమ్రా విఫలమవ్వడం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఆ జట్టు పట్టికలో 9వ స్థానంలో ఉంది. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే బుమ్రా ఫామ్ అందుకోకపోతే, ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలవడం కష్టమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఏప్రిల్ 20న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లోనైనా బుమ్రా తన పాత రిథమ్ అందుకుని వికెట్ల ఖాతా తెరుస్తాడో లేదో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి








