Gambhir: మీడియా సంస్థపై గంభీర్ రూ.2.5 కోట్ల పరువు నష్టం..!
టీం ఇండియా(Team India) హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏదోక రూపంలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అతని విషయంలో కొన్ని మీడియా సంస్థలు చేసిన విమర్శలు హద్దు మీరుతున్నాయి. తాజాగా దీనిపై అతను కోర్ట్ కు వెళ్ళాడు. గంభీర్ తాజాగా ఒక వార్తా సంస్థపై రూ. 2.5 కోట్ల పరువు నష్టం దావా(Law Suit) వేయడం క్రీడా, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా, తప్పుడు ఉద్దేశాలతో కథనాలను ప్రచురిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును(Delhi High Court) ఆశ్రయించాడు గంభీర్.
గత కొంతకాలంగా ఒక ప్రముఖ హిందీ దినపత్రిక తనపై వరుసగా ప్రతికూల కథనాలను ప్రచురిస్తోందని, అది తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. గౌతమ్ గంభీర్ వేసిన దావా ప్రకారం.. సదరు వార్తా సంస్థ తనపై వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తోందని.. ముఖ్యంగా తాను ఎంపీగా ఉన్న సమయంలో, ప్రస్తుతం కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో.. వాస్తవాలను వక్రీకరించి వార్తలు రాస్తున్నారని ఆయన ఆరోపించాడు. గంభీర్ తన బాధ్యతలను విస్మరిస్తున్నారని, అహంకారంతో వ్యవహరిస్తున్నారని అర్థం వచ్చేలా పలు కథనాలు ప్రచురితమయ్యాయి.
ఒక సెలబ్రిటీగా తనకున్న గుర్తింపును సదరు సంస్థ తన పత్రికా అమ్మకాలు పెంచుకోవడానికి లేదా ఇతర ప్రయోజనాల కోసం ఆయుధంగా వాడుకుంటోందని గంభీర్ తరపు న్యాయవాదులు వాదించారు. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో గంభీర్ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించాడు. సదరు మీడియా సంస్థ తనపై రాసిన తప్పుడు కథనాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. తన గౌరవానికి కలిగిన భంగానికి గానూ రూ. 2.5 కోట్లను పరువు నష్టం కింద చెల్లించాలని కోరాడు. భవిష్యత్తులో తనపై ఎలాంటి ఆధారాలు లేని, కించపరిచే వార్తలు రాయకుండా సదరు సంస్థను అడ్డుకోవాలని కోర్టును కోరారు.








