హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు
వచ్చే నెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరుగుతాయని ప్రకటించారు. తెలంగాణ సాహిత్య అకాడమీతో పాటు సంగీత – నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, జానపద అకాడమీలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. చక్కటి తెలుగు భాష, చక్కటి కవిత్వం తెలంగాణలో ఉందని, తెలంగాణ సాహితీ ప్రాభవం ప్రపంచానికి చాటేందుకు ఈ అకాడమీలు వేదికలు కావాలని సీఎం అన్నారు.
తెలుగు మహాసభల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్ లో సీఎం ఇవాళ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, ప్రముఖ సాహితీ వేత్తలు నందిని సిధారెడ్డి, వఝుల శివకుమార్, సీపీఆర్ఓ వనం జ్వాలా నర్సింహారావు, సీఎం ఓ.ఎస్.డి. దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
యావత్ ప్రపంచం గుర్తించే విధంగా, చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహితీ వైభవాన్ని చాటే విధంగా హైదరాబాద్ లో హోర్డింగులు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ మహాసభలకు దేశ, విదేశాల్లో ఉన్న సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆహ్వానించాలని సీఎం పేర్కొన్నారు. మహాసభల్లో భాగంగా అవధానాలు, కవి సమ్మేళనాలు, వివిధ సాహిత్య ప్రక్రియలపై సదస్సులు నిర్వహించాలన్నారు. అదేవిధంగా తెలంగాణ కవుల అముద్రిత గ్రంథాలను వెలుగులోకి తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు….రిపోర్టరు సుబ్రహ్మణ్యం








