తెలంగాణ ప్రతిష్ఠను చాటి చెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభలు
తెలంగాణ ప్రతిష్ఠను చాటి చెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ ఉత్సవాలకు విశేష ప్రాధాన్యమిచ్చి, వాటిని విజయవంతం చేస్తామన్నారు. ప్రగతిభవన్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు, సాహిత్య అకాడమీ లోగోలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవిశంకర్ రూపొందించగా, సాహిత్య అకాడమీ లోగోను సిద్ధిపేటకు చెందిన శిల్పి ఎంవీ రమణారెడ్డి తయారు చేశారు. ఆవిష్కరణ సందర్భంగా వాటిని రూపొందించిన వారిని ముఖ్యమంత్రి అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వసలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కవృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సంచాలకుడు మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








