జూన్ 2 నుంచి హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు
వచ్చే నెల 2 నుంచి 10వరకు హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని ఈ మహాసభలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరుగుతాయని ప్రకటించారు. తెలంగాణ సాహిత్య ఆకాడమితో పాటు సంగీత-నాటక ఆకాడమీ, లలిత కళా ఆకాడమీ, జానపద అకాడమీలను కూడా ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారు. చక్కటి తెలుగు భాష, చక్కటి కవిత్వం తెలంగాణలో ఉందని, తెలంగాణ సాహితీ ప్రాభవం ప్రపంచానికి చాటేందుకు ఈ ఆకాడమీలు వేదికలు కావాలని సిఎం అన్నారు. తెలుగు మహాసభల నిర్వహణకు సంబందించి ప్రగతి భవన్లో కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
యావత్ ప్రపంచం గుర్తించే విధంగా, చరిత్రలో చిరస్థాయిలో నిలిచేలా సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహితీ వైభవాన్ని చాటే విధంగా హైదరాబాద్లో హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మహాసభలకు దేశ, విదేశాల్లో ఉన్న సాహితీ ప్రియులను, తెలుగు భాష అభిమానులను, పండితులను ఆహ్వానించాలని సీఎం పేర్కొన్నారు. మహాసభల్లో భాగంగా అవదానాలు, కవి సమ్మేళనాలు, వివిధ సాహిత్య ప్రక్రియలపై సదస్సులు నిర్వహించాలని, తెలంగాణ కవుల ఆముద్రిత గ్రంథాలను వెలుగులోకి తీసుకురావాలని సీఎం సూచించారు.








