నా భర్త చావుకు నేను కారణం కాదు
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆత్మహత్యకు పాల్పడిన మధుకర్‌రెడ్డి మృతికి తాను కారణం కాదని ఆయన భార్య స్వాతి సృష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 4న మధుకర్‌రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. భర్తతో తనకెలాంటి విబేధాలు లేవని అన్నారు. తమ మధ్య గొడవలు చాలా చిన్నవని, తన భర్త ఎప్పుడూ కొట్టడం, తిట్టడం చేసేవాడని, అయినా మధుకర్‌రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తన భర్త పెళ్లయిన నాటి నుంచే డిప్రెషన్లో ఉన్నాడని, భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకున్నా, మధు బంధువులే అతడిని తప్పుదోవ పట్టించారన్నారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మధుకర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళితే అత్తమామలు తనను అడ్డుకున్నారని అన్నారు. మధుకర్ ఆత్మహత్యకు తానే కారణమని ఆరోపించారని, ఇందులో వాస్తవం లేదని తెలిపారు. మధుకర్ తన బంధువులకు సుమారు రూ.70 లక్షల వరకు అప్పులు ఇచ్చాడని, ఆర్థిక వ్యవహారాలు, మానసిక ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. తనకు రక్షణ లేదని, తన పాపకు ఏమవుతుందోననే భయంగా ఉందన్నారు. తనతోపాటు తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు.













