కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ బెల్స్!?
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఊహించినదానికి భిన్నంగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన యూనియన్లకు ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపించే ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి చవిచూడడం పట్ల పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇవి వార్నింగ్ బెల్స్ లాంటివని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతకు ఇవి అద్దం పడుతున్నాయని, అప్రమత్తం కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అక్టోబర్ 9న ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగాయి. వీటిని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాము మద్దతు ఇచ్చిన తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF), వర్కర్స్ యూనియన్ (SWU) కూటమి విజయం సాధించాలని భావించింది. అయితే… సీపీఐ బలపరిచిన ఎంప్లాయీస్ యూనియన్ (EU), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMU), నేషనల్ మజ్దూర్ యూనియన్ (NMU) కూటమి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. రాష్ట్ర స్థాయిలో క్లాస్-3 విభాగంలో సీపీఐ అనుబంధ యూనియన్ అయిన ఎంప్లాయీస్ యూనియన్ 18,250 ఓట్లను సాధించగా, TWU కేవలం 13,670 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఎంప్లాయీస్ యూనియన్ సుమారు 4,580 ఓట్ల భారీ ఆధిక్యాన్ని నమోదు చేసింది. అలాగే ప్రాంతీయ స్థాయిలో క్లాస్-6 విభాగంలో SWF 13,907 ఓట్లను సాధించింది.
ఈ ఎన్నికల ఫలితాలు కేవలం యూనియన్లకే పరిమితం కాలేదు.. రాజకీయంగా ఇది అధికార పార్టీకి పెద్ద హెచ్చరికగా మారింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ మద్దతు కూటమి కేవలం 3 యూనిట్లను మాత్రమే గెలవడం పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది. పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జ్లు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనకపోవడం, కొందరు నేతలు ప్రత్యర్థి యూనియన్లకు మద్దతు ఇవ్వడం వంటి ఆరోపణలు పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెడుతున్నాయి. అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరగనుండగా, అక్టోబర్ 17న అధికారిక తుది ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మొత్తం 900 లోపే ఉన్న పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే ఉన్న 4,580 ఓట్ల భారీ ఆధిక్యాన్ని మార్చలేవని స్పష్టమవుతోంది.
ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను పునరాలోచనలో పడేశాయి. అనుబంధ సంఘాలతో సమన్వయం, ఆర్టీసీ ఉద్యోగులతో నిరంతర సంప్రదింపులపై పార్టీ నాయకత్వం ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు సడలుతుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ తన యంత్రాంగాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.








