ఎల్నినోతో భవిష్యత్లో తీవ్ర సంక్షోభం : సీఎం రేవంత్రెడ్డి
ఎల్నినోతో పొంచి ఉన్న సంక్షోభం
సంక్షోభాన్ని గుర్తించాం.. సమస్యలపై అవగాహన కల్పించాలి
గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి
చేతికొచ్చిన పంటలను కాపాడేందుకు చర్యలు చేపట్టండి
తక్షణ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయండి
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణ చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో పరిస్థితులపై జూబ్లీహిల్స్ నివాసంలో శనివారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ లో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉండటంతో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తాగు నీరు, సాగు నీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో సరైన యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే భవిష్యత్ లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
రాబోయే 8 నెలలు కీలకం
రాబోయే 8 నెలలు ఎల్నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఎనిమిది నెలలు ప్రతీ కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు. ఎల్నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకుపకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని, కానీ .. మార్కెట్ లో విద్యుత్ అందుబాటులో లేదన్నారు.అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. విద్యుత్ ఆధారిత పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్నినో ప్రభావంపై సినిమా, మీడియా, కళాజాతలతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించాలని చెప్పారు. రైతులు వేసిన పంటల పరిస్థితులను అంచనావేసి పంట చేతికొచ్చే వరకు నీటి కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్ లో నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, చుక్క నీరు కూడా వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
త్వరలో మంత్రులతో ప్రత్యేక సమావేశం
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై త్వరలో మంత్రులతో ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో కరువు మండలాల ప్రకటనతో పాటు తగినంత ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసిందని, 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరిందని గుర్తు చేశారు. VB-G RAM G పథకంలో భాగంగా 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు సీఎం సూచించారు. అదనపు పని దినాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేసే అంశాన్ని మంత్రుల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దసరా తరువాత గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా , రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎప్పటికపుడు పరిస్థితులను సమీక్షించేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేయాలని, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు సిఎంఓ ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో న ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








