“లోకేశ్ గారూ.. మీ వాళ్లు తిడుతున్నారు.. జర చూడండి” : క్రిశాంక్
రాజకీయ పోరాటాలకు సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారుతోంది. అయితే, భావజాల ప్రచారానికి పరిమితం కావాల్సిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తరచూ వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు అడ్డాగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడోల దూకుడు ప్రదర్శిస్తున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, తనను కొందరు టీడీపీ కార్యకర్తలు తిడుతున్నారంటూ మన్నె క్రిశాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా శ్రీకాంత్ చౌదరి కుంటా అనే వ్యక్తి తనపై తీవ్రస్థాయిలో అభ్యంతరకర కామెంట్లు, అసభ్యకర పోస్టులు పెడుతున్నట్లు మన్నె క్రిశాంక్ బహిరంగంగా వెల్లడించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలనా విధానాలు, అవినీతి ఆరోపణలపై తాను గళం విప్పుతున్నాననే కక్షతోనే తనపై ఇలా దాడికి దిగుతున్నారని ఆయన ఆరోపించారు. తాము కేవలం తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాల గురించే ప్రశ్నిస్తున్నామని, తమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో గానీ, అక్కడి రాజకీయాలతో గానీ ఎలాంటి సంబంధం లేదని క్రిశాంక్ స్పష్టం చేశారు. అయినప్పటికీ, తన ప్రొఫైల్‌ను టార్గెట్ చేసి వ్యక్తిగతంగా తనను కించపరుస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై క్రిశాంక్ ఎక్స్ వేదికగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సదరు వ్యక్తి తన ప్రొఫైల్‌లో తాను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తినని చెప్పుకుంటున్నట్టు క్రిశాంక్, లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ ఆ వ్యక్తికి టీడీపీ అధికారిక సోషల్ మీడియా విభాగంతో గానీ, పార్టీతో గానీ సంబంధం ఉంటే వెంటనే అతడిని నియంత్రించాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన లోకేశ్‌ను కోరారు. రాజకీయ విమర్శలు, సిద్ధాంతపరమైన విభేదాలు ప్రజాస్వామ్యంలో సహజమని, కానీ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
మన్నె క్రిశాంక్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయడంతో, ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఇంతలో టీడీపీకి చెందిన వ్యక్తినంటూ ఒకరు క్రిశాంక్ పై నోరుపారేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు ఇటీవలికాలంలో కామన్ అయిపోయాయి. ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.








