అమెరికాలో తెలుగు యువకుడి అక్రమాలు.. కఠిన చర్యలు తీసుకున్న అగ్రరాజ్యం
అమెరికాలో ఉపాధి , చదువుల పేరుతో ఒక యువకుడిని తీసుకెళ్లి, తీవ్రమైన హింసకు గురిచేసిన అమానుష ఘటనలో ప్రధాన నిందితుడికి అక్కడి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాకు చెందిన మార్తల పుల్లారెడ్డిని అమెరికాకు తీసుకెళ్లిన వైసీపీ నేత కుమారుడు సత్తారు వెంకటేశ్‌రెడ్డికి అక్కడి న్యాయస్థానం 50 నెలల ఫెడరల్ జైలు శిక్ష విధించింది.
ఘటన వివరాలు..
పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలెం గ్రామానికి చెందిన మార్తల పుల్లారెడ్డి ఇంటర్ పూర్తి చేశాడు. అదే గ్రామానికి చెందిన వైసీపీ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సత్తారు పుష్పారెడ్డి కుమారుడైన సత్తారు వెంకటేశ్‌రెడ్డి (38) అతడిని 2022లో అమెరికాకు తీసుకెళ్లాడు. పుల్లారెడ్డికి మెరుగైన చదువులు చెప్పించి, మంచి ఉద్యోగం వచ్చేలా చూస్తానని వెంకటేశ్‌రెడ్డి నమ్మబలికాడు. కానీ అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో ఉన్న వెంకటేశ్‌రెడ్డి ఇంట్లో ఉంటూ బాధితుడు ఇంటి పనులతో పాటు ఆయన కంపెనీలోనూ పనిచేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలో నిందితులు పుల్లారెడ్డి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. అతడి ఇమిగ్రేషన్ పత్రాలను లాక్కోవడంతో పాటు తిండి పెట్టకపోవడం, నిద్రపోనివ్వకపోవడం, ఆయుధాలతో దాడి చేయడం వంటి కిరాతకాలకు పాల్పడ్డారు. 2023 నవంబర్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పటికే బాధితుడి శరీరంలో ఎముకలు విరిగి, తీవ్రంగా బరువు తగ్గి ఆసుపత్రి పాలయ్యాడు.
ఇతర నిందితుల శిక్షలు..
ఈ కేైసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ ఎ.రాస్, ప్రధాన నిందితుడైన వెంకటేశ్‌రెడ్డికి 50 నెలల ఫెడరల్ జైలు శిక్ష ఖరారు చేశారు. ఇప్పటికే స్టేట్ కోర్టులో దాడి కేసు కింద పడిన ఐదేళ్ల శిక్షతో పాటు ఈ శిక్ష అమలుకానుంది. ఈ అరాచకంలో సహ నిందితులుగా ఉన్న నిఖిల్ పెన్మత్సకు 37 నెలలు, శ్రవణ్ పెనుమెచ్చకు 30 నెలల జైలు శిక్ష పడింది.
అమెరికా సైన్యంలో మాజీ ఉద్యోగి అయిన వెంకటేశ్‌రెడ్డి తన వైకల్యాన్ని అతిగా ప్రదర్శించి ప్రభుత్వ సంక్షేమ విభాగం నుంచి అదనంగా 83,776 డాలర్లు (సుమారు రూ.81 లక్షలు) అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మోసానికి గాను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ , వెటరన్స్ అఫైర్స్ విభాగాలకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.








