తెలంగాణ పోలీసులకు మరో అరుదైన గౌరవం
ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్-2017 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ పోలీసులకు అవార్డుల పంట పండింది. వివిధ విభాగాల్లో నూతన పద్ధతుల్లో సేవలందించిన పోలీసులకు ఫిక్కీ ఢిల్లీలో అవార్డులను ప్రదానం చేసింది. అన్ని రాష్ట్రాల కంటే అధికంగా తెలంగాణ పోలీసులు 5 అవార్డులు అందుకున్నారు. సైబర్ క్రైమ్ విభాగంలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు, పాస్‌పోర్టు తనిఖీ, వేలిముద్రల గుర్తింపు, స్మార్ట్పోలీస్ అధికారి, స్మార్ట్ ఇన్నోవేషన్ విభాగాల్లో తెలంగాణ పోలీసులకు అవార్డులు దక్కాయి. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి స్మార్ట్ పోలీస్ అవార్డు దక్కింది.
ఫిక్కీ అవార్డుల పట్ల తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసులను అభినందించారు. స్మార్ట్ పోలీసింగ్ అవార్డుల్లో రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చిందన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని అవార్డులు తీసుకొస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. నూతన విధానాలు, సాంకేతికతతో పోలీసులు ముందుకెళ్తున్నారన్నారు.








