సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాక్?
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ప్రతిభను బట్టే ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మెరుగుపడని ఎమ్మెల్యేలకు టిక్కెట్ల షాక్ తగలనుంది. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుండీ తనకు విశ్వసనీయ ఫలితాలు అందిస్తున్న ఏజెన్సీ నిర్వహించిన సర్వేతో నిర్దారించుకున్నారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ పరిస్థితి పై సీఎం కేసీఆర్ ఇప్పటికే మూడుసార్లు సర్వే జరపగా ఆందోళనకరమైన ఫలితాలు కనిపించాయి. దాంతో పనితీరు మెరుగుపడని ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించని నేతల తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను నేరుగా ఎమ్మెల్యేలకే నివేదించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా పనిచేయాలని, ప్రజల మధ్యే ఉండాలని గర్వం తలకెత్తుకోవద్దని హెచ్చరించారు. పనితీరు బాగా లేనివారికి తాను నేరుగా లైన్లోకి వెళ్లి మందలించడమో, మంత్రుల ద్వారా హెచ్చరికల సంకేతాలు పంపడమో చేశారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, వంద సీట్లు ఖాయంగా సాధిస్తామన్న ధీమాను టీఆర్ఎస్ వ్యక్తం చేస్తోంది. ఎంఐఎం సీట్లు మినహా మిగతా 112 సీట్లనూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని టిఆర్ఎస్ నిర్ణయించింది.








