అక్టోబర్ 22 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
తెలంగాణ ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు విజయదశమి పర్వదినమైన సెప్టెంబర్ 30వ తేదీ అంకురార్పణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహాసభలను అక్టోబర్ 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తొలుత ఈ మహాసభలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని జూన్ 2న అంకుర్పారణ చేయలనుకున్న సంగతి తెలిసిందే. అయితే జూన్ 2వ తేదీ అష్టమి కావడంతో పాటు ఆ తరువాత రోజుల్లో వాతావరణం అనుకూలంగా ఉండదని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఇతర సాహితీ ప్రముఖులు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుకు తెలిపారు. ప్రగతిభవన్‌లో సాహితీవేత్తలు పలువురు ముఖ్యమంత్రిని కలిసి మహాసభల నిర్వహణపై చర్చించారు. మొదట అనుకున్నట్లు జూన్‌లో కాకుండా అక్టోబర్‌లో నిర్వహిస్తే బాగుంటుందని వారు చెప్పారు. దేశ విదేశాల నుంచి తెలుగు సాహితీరంగ ప్రముఖులను ఆహ్వానించడంతోపాటు ఏర్పాట్లు కూడా ఘనంగా చేయాల్సి ఉన్నందున అందుకు తగిన వ్యవధి అవసరమని భావించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 22 నుంచి 28 వరకు తెలంగాణ ప్రపంచ మహాసభలకు ఏర్పాట్లు చేయాలని, ఎజెండా రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.








