తెలంగాణలో స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రారంభం
నూతన ఆవిష్కరణల విధానంలో సరికొత్త అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫార్మా, వ్యవసాయ ఇతర శాఖల్లో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు రూపొందించిన స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (ఎస్ఐసీ) తన కార్యకలాపాలను బుధవారం నుంచి ప్రారంభించింది. స్టేట్ ఇన్నోవేషన్ పాలసీ రూపొందిచడంలో భాగంగా ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు గతంలో ప్రకటించారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ నుంచి ఇన్నోవేషన్ సెల్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. పరిశోధన, వినూత్న ఆవిష్కరణల్లో భాగంగా టీ హబ్, రిచ్ లాంటి సంస్థల ఏర్పాటుపై ప్రపంచ వ్యాప్తంగా సర్కారుకు ప్రశంసలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివిధ రంగాల పారిశ్రామిక వర్గాలు, జాతీయ, అంతర్జాతీయ పరిశోధకులు అభినందించారు. ఎస్ఐసీకి తాత్కాలికంగా ట్రిపుల్ ఐటీ ఫ్రొఫెసర్ ఎల్ రమేశ్ నేతృత్వం వహించనున్నట్లు మంత్రి కే తారక రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఐసీ ప్రధానంగా ఇన్నోవేషన్ పాలసీలో స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్లకు ప్రకటించిన రాయితీలు, ప్రోత్సాహకాలను సింగిల్ విండో విధానంలో ఇవ్వనున్నది. తన పరిధిని విస్తృతం చేయడంపై దృష్టి పెట్టనుంది. ఇంక్యుబేటర్లు స్థాపించాలనుకునే వారి వివరాలు, నెట్వర్క్ సమాచారాన్ని సేకరించనున్నది.








