ఈ నెల 26న మహాబతుకమ్మ సంబురాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26న మహాబతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగ కోసం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ మురిసేలా బతుకమ్మ కానుకగా ఇప్పటికే చేనేత చీరెల పంపింణీకి శ్రీకారం చుట్టింది. దాదాపు 35 వేల నుంచి 40 వేల మందితో లాల్బహాదుర్ స్టేడియం వేదికగా నిర్వహించనున్న తెలంగాణ బతుక్మమ పండుగ గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డులను ఎక్కనున్నది. గౌరమ్మతల్లిని పూజిస్తూ తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుక్మమ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ టూరిజం ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం మహాబతుకమ్మ ఉత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సిద్ధమయ్యాయి. ప్రతి జిల్లా నుంచి వెయ్యి మంది మహిళలు, మహాబతుకమ్మ సంబురాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ సమీప జిల్లాల నుంచి 10వేల మంది మహిళలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 35వేల నుంచి 40వేల మంది ఆడబిడ్డలతో చరిత్రలో ఎక్కడ నిర్వహించని విధంగా ఉత్సవాన్ని జరిపించి, గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డులో జాగా సంపాదించాలని అధికారులు కృషి చేస్తున్నారు.













