తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌కు త్వరలోనే శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి తాను అనుకున్నట్లుగానే కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించేందుకు రెడీ అయిపోయారు. కాకపోతే ఈ కొత్త సెక్రటేరియట్కోసం ఆయన మూడేళ్ళపాటు ఆగాల్సి వచ్చింది. స్థలం ఎంపిక, కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇలా అన్నీ పూర్తయి ఇప్పుడు సెక్రటేరియట్ కొత్త భవన నిర్మాణానికి తెలంగాణ రెడీ అయింది. సకల సదుపాయాలు, సర్వ హంగులతో సువిశాల సచివాలయాన్ని నిర్మించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన కార్యరూపం దాల్చబోతోంది. అనేక ప్రత్యేకతలతో కూడిన పరిపాలన కేంద్ర సముదాయం నమూనా విడుదలైంది. ఇందుకు సంబంధించి గత కొంత కాలంగా ప్రజల్లో ఉన్న అనేక అనుమానాలను నివృతి చేస్తూ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన సచివాలయ నమూనా చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విదంగానే సికింద్రాబాద్ లోని బైసన్ పోలో క్రీడా మైదానంలో నిర్మాణ పనులుకు శంకుస్థాపన చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. అక్కడే శాసనసభ, శాసన మండలి, తెలంగాణ కళాభారతి భవనాలను కూడా నిర్మించనున్నారు. ఇప్పటివరకు రక్షణశాఖ సైనిక శిక్షణ కోసం ఉపయోగిస్తున్న ఈ స్థలాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది.
దసరా పండుగ రోజున కొత్త సచివాలయ నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి నిర్మాణాలను పూర్తి చేసి కన్నుల పండువగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవాలని సంకల్పించారు. ఆ దిశగా లక్ష్యాలను ఎంచుకుని ముందడుగు వేయవలసిందిగా ఉన్నతాధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. భూగర్భంలో ఆరు అంతస్థుల పార్కింగ్ కాంప్లెక్స్, భూమికి సమాతరంగా పైన ఎనిమిది అంతస్థుల పరిపాలనా భవనాలు నిర్మించేందుకు రోడ్లు, భవనాలశాఖ ఇంజనీరింగ్ నిపుణులు నమూనాలు, రోడ్ మ్యాప్‌లను తయారు చేశారు.
సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయ భవన నిర్మాణ సముదాయం నిర్మాణానికి నమూనాను కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆదే మైదానంలో సచివాలయానికి కుడివైపున రాష్ట్ర విధాన సభ, విధాన మండలి భవనాలను నిర్మించాలని సీఎం ప్రతిపాదించారు. అలాగే ఎడమ వైపున తెలంగాణ హైకోర్టు భవనాన్ని నిర్మించనున్నారు. ఈ మూడు ప్రధాన భవన సముదాయాల ముందు భాగంలో ఉన్న ఖాళీ స్థలాన్ని రాష్ట్ర మైదానంగా ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్వహించే అధికార కార్యక్రమాలన్నింటినీ అక్కడే జరుపుకునేందుకు వీలుగా సదుపాయాలు కల్పిస్తారు. అనుకున్న సమయానికి పునాది వేసి గరిష్టంగా ఏడాది తిరగక ముందే పూర్తిచేసే దిశగా నిర్ధిష్టమైన కార్యచరణలో ముందడుగు వేస్తున్నారు.








