సమస్యలు చెప్పుకోండి : మహిళలకు భరోసా 181నెంబర్
మహిళలపై దాడులు, హింసను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆపదలో ఉన్న మహిళలను భరోసా ఇచ్చేందుకు 181 అనే హెల్ప్ లైన్ నెంబర్ తీసుకొచ్చింది. మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ హెల్ఫ్ లైన్ నంబర్ ను ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. మహిళలకు సంబంధించిన ఏ ఫిర్యాదులైన ఈ నెంబర్ కు కాల్ చేసి చెప్పొచ్చన్నారు మంత్రి. 24 గంటలూ పని చేస్తుందన్నారు. మహిళల భద్రత కోసం మేమున్నాం అనే నినాదంలో భాగంగానే ఈ భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఏ మహిళ కన్నీళ్లు పెట్టుకోకూడదన్నారు. రక్షణ పొందడటంతోపాటు సలహాలు, సూచనలు కూడా అందిచనున్నట్లు వెల్లడించారు మంత్రి తుమ్మల.
ఎలాంటి ఫిర్యాదు చేయొచ్చు :
గృహ హింస, భర్తతో వైవాహిక సమస్యలు, అత్త మామల వేధింపులు, కట్నం కోసం చిత్రహింసలు, NRI పెళ్లి బాధితులు, తల్లిదండ్రులు, భర్త వేధింపులు, మహిళల ఆస్తి వివాదాలు, బెదిరింపులు, లైంగిక దాడులు, స్కూల్, కాలేజీల్లో వేధింపులు, ఆఫీసుల్లో లైంగిన హింస ఎదుర్కొనే మహిళలు, కుటుంబ సభ్యుల నుంచి నిరాదరణ పొందుతున్న వృద్ధ మహిళలు ఈ హెల్ఫ్ లైన్ కు కాల్ చేసి తమ సమస్యలు చెప్పుకోవచ్చు.
హెల్ప్ లైన్ ఎలా పని చేస్తుందంటే :
… 365 రోజులు.. 24 గంటలూ పని చేస్తుంది.
… సమస్య పరిష్కారంతోపాటు కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచుతారు. మీరు చెప్పే సమస్య అంతా రికార్డ్ అవుతుంది.
… పబ్లిక్ ప్లేసులు, స్కూల్, కాలేజీల్లో లైంగిన వేధింపులను ఎదుర్కొనే వారి సమాచారాన్ని పోలీసులు, షీ టీమ్స్ అందిస్తారు.
… మానసిక ఆందోళన ఉన్నా.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచన ఉంటే.. అలాంటి వారికి సైకాలజిస్టులు, సైక్రియాట్రిస్ట్ లతో కౌన్సెలింగ్ ఇస్తారు.
… అవసరం అనుకుంటే చట్టపరమైన సాయం కూడా చేస్తారు. అవగాహన కల్పిస్తారు.
… నిరాదరణకు గురయ్యి, నీడలేని మహిళలకు షార్ట్ స్టే హోమ్స్, స్వాధార్ హోమ్స్ కు పంపించి ఆదుకుంటారు.
… అనుకోని ఘటనల్లో ఎవరైనా వసతి కావాలంటే అలాంటి వారికి తాత్కాలిక సాయం చేయటంతోపాటు విడిది కూడా ఏర్పాటు చేస్తారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే మహిళల సమస్యల కోసం ప్రత్యేకంగా 181 హెల్ప్ లైన్ సెంబర్ నెంబర్ తీసుకొచ్చింది ప్రభుత్వం.













