సైబరాబాద్ వల్లే తెలంగాణ ధనిక రాష్ట్రం : రమణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్మించిన సైబరాబాద్ వల్లే తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ మహానాడులో ఆయన ప్రసంగించారు. పేదల జీవితాల్లో వెలుగు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీయే అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఎంతో మందికి పార్టీ రాజకీయ జీవితాన్నిచ్చిందన్నారు. గిట్టుబాటు ధర రాక రైతులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సొంత ఎజెండాతో ముందుకు వెళ్తూ రాజకీయ నియంతగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. రైతులకు ధైర్యం చెప్పేందుకు కూడా ముఖ్యమంత్రికి తీరికలేకుండా పోతుందన్నారు. తెలుగుదేశం పార్టీ పోరాటం వల్లే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహరం లభించిదన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు.








