సమీక్షలు సరే… ఆదాయం ఏదీ?’ రేవంత్ రెడ్డి సీరియస్
తెలంగాణ ఖజానాను నింపే మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటైన ‘రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్’ సబ్‌కమిటీ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఫైళ్లు కదలడం, సమావేశాలు జరగడం వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, క్షేత్రస్థాయిలో ఆదాయం పెరిగినప్పుడే ఆ కమిటీ ఉనికికి సార్థకత ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేస్తూ, పరిపాలనలో వేగం పెంచాలని హెచ్చరించారు.
ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం, ఇందుకోసం మంత్రుల నేతృత్వంలో సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, ఈ కమిటీ పలుమార్లు భేటీ అయినప్పటికీ, ఆదాయాన్ని పెంచే దిశగా ఇప్పటివరకు ఎలాంటి విప్లవాత్మకమైన లేదా స్పష్టమైన ప్రతిపాదనలు ముందుకు రాలేదు. దీనిపై సీఎం మండిపడ్డారు. సమావేశాలు నిర్వహించడం ముఖ్యం కాదని, ఆ సమావేశాల ద్వారా ఖజానాకు ఎంత ఆదాయం సమకూరిందో లెక్కలు చూపాలని అధికారులను నిలదీశారు. కేవలం అంకెలు, అంచనాలకే పరిమితం కాకుండా, ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత కీలక దశలో ఉంది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలు, మరోవైపు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల చెల్లింపులు ప్రభుత్వానికి పెను సవాలుగా మారాయి. ఖర్చులు గణనీయంగా పెరుగుతున్న తరుణంలో, అందుకు తగ్గట్టుగా ఆదాయ వనరులు పెరగకపోవడం పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే, సంక్షేమ పథకాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఖజానా గండం గట్టెక్కాలంటే సంప్రదాయేతర మార్గాల్లో కూడా ఆదాయాన్ని రాబట్టాలని సూచించారు.
ఈ జాప్యాన్ని ఇక ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 100 రోజుల్లో తక్షణమే అమలు చేయగలిగే, ఫలితాలను ఇచ్చే ఆదాయ పెంపు మార్గాలపై స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. మే 4వ తేదీ నాటికి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని స్పష్టం చేశారు. అదే రోజు మళ్లీ కేబినెట్ సమావేశం నిర్వహించి, కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి తదుపరి కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
తెలంగాణను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి, అధికారుల అలసత్వాన్ని ఏమాత్రం ప్రోత్సహించడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆదాయం పెంచే విషయంలో ‘వంద రోజుల లక్ష్యం’ ఇప్పుడు అధికారుల ముందున్న పెద్ద సవాలు. మే 4న జరగబోయే కేబినెట్ భేటీలో ఎలాంటి విప్లవాత్మక నిర్ణయాలు వెలువడతాయో, రాష్ట్ర ఆర్థిక గమనం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. కేవలం మాటలు కాకుండా, అంకెల్లో ప్రగతిని చూడాలని కోరుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్, రెవెన్యూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించే పనిలో నిమగ్నమైంది.
ఇవి కూడా చదవండి








