ఉస్మానియా యూనివర్సిటీకి మరో అరుదైన గౌరవం
శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ మరో ఘనతను దక్కించుకుంది. దేశంలోని అత్యున్నత యూనివర్సిటీల జాబితాలో అయిదో స్థానం సాధించింది. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చిలో ద వీక్ హన్సా రీసర్చ్ సంస్థ దేశంలోని మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీలపై సర్వే నిర్వహించింది. వర్సిటీల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, కోర్సులు, పరిశోధనలు, ఇతర వసతులను పరిగణనలోకి తీసుకుంది. మొదటి స్థానంలో డిల్లీ యూనివర్సిటీ నిలువగా, తరువాత స్థానాల్లో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిలిచాయి. గత నాలుగేళ్లుగా ఈ సర్వేలో తన స్థానాన్ని ఓయూ క్రమేణా మెరుగుపరుచుకుంటూ వస్తున్నది 2014లో నిర్వహించిన సర్వేలో ఐదో స్థానం, 2015లో ఏడో, 2016లో ఆరో స్థానంలో నిలిచింది. తాజాగా మరో ర్యాంకును మెరుగుపరుచుకుంది.













