హైదరాబాదీలకు అలర్ట్ : భారీ వర్ష సూచన : అత్యవసరం అయితేనే బయటకు రండి
చీకటి.. హైదరాబాద్ ఆకాశాన్ని కారు మబ్బులు కమ్మేశాయి. ఇంట్లో ఉన్నా.. బయటకు వచ్చినా లైట్లు వేసుకోవాల్సిన సిట్యువేషన్. వాహనదారులు అయితే కిక్ తోపాటు లైట్ కూడా వేసుకుంటున్నారు. కళ్ల ముందు గంట సమయంలో మారిపోయిన వాతావరణంతో భయపడిపోయారు జనం.
భారీ వర్ష సూచన :
హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చెప్పింది వాతావరణ శాఖ. క్యుములో నింబస్ మేఘాలతో కొద్ది సమయంలో కుండపోత వర్షం పడే సూచనలు ఉన్నాయని ప్రకటించింది. ఈదురుగాలులు కూడా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. GHMC అధికారులను అప్రమత్తం చేసింది. అలర్ట్ గా ఉండాలని కోరింది. అదే విధంగా ట్రాఫిక్ పోలీసులకు సూచనలు చేసింది. భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలుస్తాయని.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉందని ముందస్తు అలర్ట్ ఇచ్చింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ (సెప్టెంబర్ 6) హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
అత్యవసరం అయితేనే బయటకు వెళ్దాం :
హైదరాబాద్ లో కారు మబ్బులు.. భారీ వర్ష సూచనలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హయత్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే అత్యవసరం అయితేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు అధికారులు. భారీ వర్షం పడితే.. ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉంటుందని.. ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో… ఇవాల్టి వాతావరణ శాఖ హెచ్చరికలతో అత్యవసరం అయితేనే బయటకు వద్దాం.. ఇబ్బందులను నుంచి తప్పించుకుందాం. ఇప్పటికే నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ఈదురుగాలులు వీస్తుండటంతో పలు ఏరియాల్లో కరెంట్ సరఫరా నిలిపివేశారు.








