మూడు రోజుల్లోనే పాస్‌పోర్టు
దేశంలో తొలిసారి కేంద్ర ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వశాఖ 10 అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఈ నెల 13వ తేదీన హెచ్ఐసిసిలో ఒప్పంద కార్యక్రమం జరగనున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 10 రోజుల వ్యవధిలో పాస్‌పోర్టును జారీ చేస్తున్నారు. ఈ వ్యవధిని మరింతగా తగ్గించి కేవలం మూడు రోజుల్లోనే జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. ప్రయోగాత్మకంగా దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో మూడు రోజులలో పాస్‌పోర్టు జారీ చేసే విధానం అమలు చేయనున్నారు. ఉపాధి కల్పనా కేంద్రాలు, హైదరాబాద్‌లోని టామ్‌కామ్ కేంద్రాలలో ఇకనుంచి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. మోసకారుల బారినుంచి విదేశాలకు వెళ్ళేవారిని కాపాడేందుకు వీలుగా వీసా, పాస్‌పోర్టు నిబంధనలపై తెలుగు, ఉర్ధూ భాషలలో ప్రచురించిన పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.








