చరిత్రలో నిలిచిపోయేలా ప్రపంచ తెలుగు మహాసభలు
వచ్చే అక్టోబర్ 22 నుంచి 28 వరకు హైదరాబాద్లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను చరిత్రలో నిలిచిపోయేలా శాఖలన్నీ సమన్వయంతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ కోరారు. సచివాలయంలో మహాసభల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఖ్యాతిని చాటేలా తెలుగు మహాసభలను జరుపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. మహాసభలకు దేశవిదేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. మహాసభల లోగోను జులై మొదటివారంలో విడుదల చేస్తామన్నారు. రవీంద్రభారతిలో సాహిత్యా అకాడమీలో మహాసభల నిర్వాహక కార్యాలయం ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలుగు మహాసభలకు ఎల్బీస్టేడియంలో జరుపుతామని అన్నారు. రవీంద్రభారతి, తెలుగు లలితకళాతోరణం, తెలుగు విశ్వవిద్యాలయాల్లో సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు రమణచారి వెల్లడించారు. దేశ విదేశాల నుంచి మొత్తం 5వేల మంది హాజరవుతారన్నారు.








