మధ్యప్రదేశ్ లో మిషన్ భగీరథ
తెలంగాణలోని మిషన్ భగీరథ తరహాలో మధ్యప్రదేశ్‌లో కూడా ప్రారంభించనున్నట్టు ఆ రాష్ట్ర అధికారుల బృందం స్పష్టం చేసింది. మిషన్ భగీరథ ఖరీదైన ప్రాజెక్టు కాదు, అద్భుతమైన ప్రాజెక్టు అని మధ్యప్రదేశ్ తాగునీటి శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ అశీష్ కుమార్ శ్రీవాత్సవ అన్నారు. ప్రజారోగ్యం కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసినా తక్కువేనని చెప్పారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన మధ్యప్రదేశ్ తాగునీటి అధికారుల బృందం మొదటి రోజు నగరంలో అధికారులను కలిసింది. భగీరథ ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఈఎన్సి సురేందర్‌రెడ్డి వివరించారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించాలనే ప్రయత్నం చాలా గొప్పదని, అందుకే ఇప్పుడు దేశం మొత్తం మిషన్ భగీరథను ఆసక్తిగా గమనిస్తోందని చెప్పారు. తెలంగాణలో ఈ ప్రాజెక్టును చూసి రావాలని కేంద్రమే తమకు సూచించిందని అధికారులు తెలిపారు. త్వరలో తమ రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రాజెక్టు ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ఇక్కడి అనుభవాలను ఉపయోగించుకుంటామని చెప్పారు.








