నేడు మహా బతుకమ్మ
తెలంగాణ మహిళలకు ఆరాధ్యమైన బతుకమ్మ పండుగ రాష్ట్రస్థాయి ఉత్సవాలు నేడు హైదరాబాద్లో జరగనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో వచ్చే మహిళలతో ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఉపసభాపతి పద్మాదేవేందర్రెడ్డి, మంత్రుల సతీమణులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు ఇతర మహిళానేతలు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాలోని 429 మండల కేంద్రాల నుంచి మహిళలను తరలించేందుకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. బస్సుల్లో వచ్చే ప్రతీ ఒక్కరికీ భోజనం, తాగునీరు అందించనున్నారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం నుంచి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఈ సందర్బంగా గిన్నీస్ రికార్డు కోసం మూడువేల మంది మహిళలు తంగేడు పూల ఆకారంలో నిలుచొని బతుకమ్మ ఆడతారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఏర్పాట్లను పర్యవేక్షించారు.








