Komatireddy: ‘మంత్రి పదవి ఇవ్వకుంటే మీకే నష్టం..’ రాజగోపాల్ రెడ్డి వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. “నాకు మంత్రి పదవి ఇస్తే అది నా కంటే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ సర్కార్కే ఎక్కువ మైలేజీ తెస్తుంది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నాలాంటి ఉద్యమకారుల సేవలు కచ్చితంగా అవసరం” అంటూ ఆయన నేరుగా అధిష్ఠానానికే అల్టిమేటం జారీ చేశారు.
అసెంబ్లీ డైనింగ్ హాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌లతో కలిసి రాజగోపాల్ రెడ్డి సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై అనేక గుసగుసలు వినిపించాయి.
ఇవి కూడా చదవండి
అయితే తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని ఆ తర్వాత కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. 2018లో 88 సీట్లు వచ్చినా కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్పని కేటీఆర్ ముఖం మీదే చెప్పానని ఆయన వివరించారు. అయితే, ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముగ్గురు వేర్వేరు పార్టీల నేతలు గంటల కొద్దీ ఏకాంతంగా చర్చించుకోవడం వెనుక “క్రాస్ పార్టీ ఫ్లర్టేషన్” జరుగుతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ సందర్భంలోనే 2023 ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో రోడ్లు, భవనాల పనులు ఆగిపోవడం, కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. పలుమార్లు ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పారు. గత నెలలోనే “మంత్రి పదవి ఇవ్వకపోతే నేనే ముఖ్యమంత్రిని అవుతాను” అని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.
తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ, ఉద్యమ నేపథ్యం ఉన్న తనను పక్కన పెట్టడం పార్టీ చేస్తున్న పెద్ద పొరపాటని ఆయన భావిస్తున్నారు. ఇటీవల 15 మంది ఎమ్మెల్యేలతో ఆయన నిర్వహించిన ‘రహస్య డిన్నర్’ భేటీ కూడా పార్టీలో తన పట్టును నిరూపించుకునే ప్రయత్నమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఈ వరుస వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి








