దేశంలో అగ్రగామిగా తెలంగాణ ఐటి రంగం
తెలంగాణ ఐటి రంగం దేశంలో అగ్రగామిగా దూసుకుపోతోందని, ఐటి రంగం తన కార్యకలాపాలను విస్తరిస్తోందని, రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన నూతన ఐటి విధానం, ప్రోత్సాహకాలకు అనేక బహుళ జాతి కంపెనీలు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. మంగళవారం ఇక్కడ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్‌ప్రైజస్ అసోసియేషన్ (హైసీ) వార్షిక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటి ఉత్పత్తుల ఎగుమతులు 87 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయన్నారు. ఐటి రంగం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా ఉందన్నారు. హైదరాబాద్‌లో అపారమైన మానవవనరులు ఉన్నాయని, ఇక్కడ ప్రభుత్వ పాలసీలకు మదుపరులు ఆకర్షితులవుతున్నారన్నారు. చిన్న, మధ్యతరహా ఐటి కంపెనీలు మొత్తం ఐటి ఉత్పత్తుల ఎగుమతుల రెవెన్యూలో 10 శాతం వాటా కలిగి ఉన్నాయన్నారు. క్లౌడ్, మొబైల్, బిగ్ డేటా అనలిటిక్స్ రంగాలు ఊపందుకున్నాయన్నారు. సెక్యూరిటీ, అనలిటిక్స్ విభాగాలు చిన్న, మధ్యతరహా ఐటి రంగాన్ని తారాస్థాయికి తీసుకెళుతున్నట్లు చెప్పారు. ఐడి సి దక్షిణాసియా ఎండి జయదీప్ మెహతా మాట్లాడుతూ ఐటి రంగంలో ఉద్యోగావకాశాలను వివరించారు. ఐవోటి, ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, రొబొటిక్స్, 3డి ప్రింటింగ్, వర్చువల్ రంగాలు ఐటి రంగాన్ని శాసిస్తున్నాయని పేర్కొన్నారు.








