రాచకొండ కమిషనర్‌కు టిప్ హీరో అవార్డు
రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్‌కు 2017 ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ (టిప్)హీరో పురస్కారాన్ని యూఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా అందజేశారు. అమెరికా డిపార్ట్మెంట్ స్టేట్ అందించే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును జూన్ 27వ తేదీన వాషింగ్టన్ డీసీలో అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిలర్సన్ ఆధ్వర్యంలో ప్రదానం చేయగా భగవత్ హాజరుకాలేకపోయారు. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసు విభాగం మహిళల అక్రమ రవాణాను నిరోధించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని ఈ సందర్భంగా క్యాథరీన్ హడ్డా పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైల్వే డీజీపీ టి.కృష్ణప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌త్రివేది, నగర, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సందీప్ శాండిల్య తదితరులు పాల్గొన్నారు.













