హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికకాబోతున్నది. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ)పై హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో వచ్చే నెల 24 నుంచి ఐదు రోజుల పాటు గ్లోబల్ సదస్సు జరుగబోతున్నది. ఈ అంతర్జాతీయ సదస్సుకు భారత్, చైనా, ఆస్ట్రేలియా దేశాలతోపాటు మరో 13 దేశాల నుంచి 700 మంది అధికారులు హాజరవనున్నారు. గత మేలో చివరి సమావేశాలు ఫిలిప్పీన్స్లో జరిగాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సదస్సును ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వస్తువులు, సేవల రంగాల్లో పెట్టుబడులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో 16 సభ్యదేశాలు కలిసి ఆర్సీఈపీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సుమారు 6 వేల మంది డెలిగేట్స్ హాజరుకావచ్చని అంచనా.








