చెన్నమనేని జర్మనీ పౌరుడే : కేంద్ర హోంశాఖ
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం చెల్లదని.. ఆయన జర్మనీ పౌరుడేనని కేంద్ర హోం శాఖ తేల్చిచెప్పింది. దీంతో రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశాలున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ నేత ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. రమేశ్ పౌరసత్వంపై ఆరు వారాల్లో తమకు నివేదిక అందించాలని ఆగస్టు 28న కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం రమేశ్‌బాబు పౌరసత్వం పొందారా.. లేదా అన్నది తేల్చాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వారం రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించింది.








