శంషాబాద్ లో హై అలర్ట్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో శంషాభాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలెర్ట్ ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ వరకు సందర్శకుల పాస్‌లను కూడా రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారుల ఆదేశాల మేరకు సాయుధ బలగాలను మోహరించారు. విమానాశ్రయం లోపలికి వచ్చే రెండు ప్రధాన రహదారులు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్లాట్ ఫారాల వద్ద తనిఖీలు నిర్వహిస్తునట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయానికి వచ్చే రహదారులపై సైతం గట్టి నిఘా వేసి ఉంచామని, అడుగడుగునా వాహనాల తనిఖీలు చేపట్టామని, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే, విమానాశ్రయం సిబ్బందికి గానీ, పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని విమానాశ్రయం అధికారులు సూచించారు.








