హైదరాబాద్ కు దక్కిన మరో గౌరవం
అమెరికా – భారత్ కలిసి నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సమ్మేళనానికి హైదరాబాద్ వేదికగా నిలిచింది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల కీలక ప్రతినిధులు రాష్ట్ర రాజధానిలో కాలుమోపనున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సమ్మేళనం 2017 (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమిట్)ను హైదరాబాద్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరులో మూడు రోజులపాటు ఈ సమ్మేళనం జరిగే అవకాశం ఉంది.
ఎనిమిదో సమ్మేళనాన్ని భారత్-అమెరికాలు సంయుక్తంగా భారత్లో నిర్వహించాలని గతేడాది ప్రధాని మోదీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా నిర్ణయించారు. హైదరాబాద్, ముంబయి, బెంగళూరు నగరాల్లో ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై కేంద్రం గత కొద్దిరోజులుగా తర్జనభర్జనలు పడుతూ వచ్చింది. మౌలిక సదుపాయాలు, భద్రతాపరమైన అంశాలపై వివిధ సంస్థలు ఇచ్చిన నివేదికలను పరిశీలించిన కేంద్రం సమ్మేళన వేదికగా హైదరాబాద్ తాజాగా ఖరారు చేసింది.
కేంద్రం వేదికను ఖరారు చేసినప్పటికీ తేదీలను ఇంకా నిర్ణయించలేదు. ప్రాథమిక సమాచారం మేరకు నవంబరు చివరి వారంలో నిర్వహించే అవకాశముందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నవంబరు 28, 29, 30 తేదీలలో ఈ సమ్మేళనం జరిగే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2010లో తొలిసారిగా వాషింగ్టన్ డీసీ( అమెరికా)లో నిర్వహించారు. 2011లో ఇస్తాంబుల్ (టర్కీ), 2012లో దుబాయి( యూఏఈ), 2013లో కౌలాలంపూర్ (మలేషియా), 2014లో మ్యారేక( మొరాకో), 2015 నైరోబి (కెన్యా), 2016లో సిలికాన్ వ్యాలీ( అమెరికా)లో నిర్వహించారు.








