‘మర్యాద మాసం’
జిహెచ్ఎంసిలోని ప్రతి అధికారి, సిబ్బందిలో అంకితభావం, చక్కటి పనినైపుణ్యతను పెంపొందించేందుకు కమిషనర్ జనార్దన్ రెడ్డి మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయన పలు సార్లు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి పాఠాలు చెప్పినా, మార్పు రాకపోవటంతో మరో ప్రయత్నం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వచ్చే సెప్టెంబర్ మాసం మొత్తాన్ని జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది మర్యాద మాసంగా పాటించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మర్యాదగా మాట్లాడుకుందాం, ఐలవ్ మై జాబ్, సేవ్ ఎనర్జీ, చిన్న పొరపాటుకు భారీ మూలం వంటి తదితర సందేశాలతో కూడిన స్టిక్కర్లను రూపొందించిన జిహెచ్ఎంసికి చెందిన అన్ని కార్యాలయాల్లో అంటించారు. అయినా కొందరు అధికారుల్లో కింది స్థాయి సిబ్బందిని గౌరవించకపోవటం, మరికొందరు ఇష్టారాజ్యంగా వ్యవహారించటం వంటి పరిణామాలు కమిషనర్ దృష్టికి వచ్చాయి. దీంతో అధికారులు, ఉద్యోగుల్లో తమ విధులలను వంద శాతం నిబద్దతతో నిర్వర్తించేందుకు వీలుగా సెప్టెంబర్ మాసాన్ని మర్యాదమాసంగా పాటించాలని ఆదేశించారు.








