మహానగరంలో రేపే గణేశ్ నిమజ్జనం
మహానగరంలో రేపు గణేశ్ నిమజ్జన మహోత్సవం జరగనుంది. గణపతి మహా శోభాయాత్రకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీపీజీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. గతేడాది మాదిరిగానే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ముందుగా నిర్వహించాలని నిర్ణయించామని, దీనికి గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఒప్పుకుందని వెల్లడించారు. గణేష్ శోభాయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాద్‌లో నిమజ్జనాకి సుమారు 26వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బందోబస్తులో 11 మంది ఐజీలు, నలుగురు డీఐజీలు, 10 మంది ఎస్పీలు, ఏడుగురు ఏఎస్పీలు, 122 మంది డీఎస్పీలు, 333 మంది సీఐఐ, వెయ్యి మందికి పైగా ఎస్ఐలు, 80 ప్లాటూన్ల పారా మిలటరీ బలగాలు విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెయ్యి మంది పోలీసులు రానున్నట్లు తెలిపారు. గణపతి శోభాయాత్ర మార్గాల్లో సీసీ కెరెమరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, ఏరియల్ సర్వే ద్వారా బందోబస్తు పరిశీలిస్తామని పేర్కొన్నారు.








