ప్రతి రంగంలోనూ మహిళలకు అవకాశాలు : ఉపరాష్ట్రపతి
ప్రతి రంగంలోనూ మహిళలకు అవకాశాలు కల్పిచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. విద్యానగర్ ఏటీఐ (అడ్వాన్స్డై ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లో రీజినల్ వొకేషన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఆర్వీటీఐ)కు ఉప రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించి శిక్షణ అందించాలన్నారు. దేశంలో మహిళల విద్య 65.45 శాతంగా ఉంది.ఈ శాతం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. నైపుణ్య రంగంలో మన దేశంలో సరైన శిక్షణ లేదన్నారు. మన దేశం కంటే చిన్న దేశాలు ఎలక్ట్రానిక్ రంగంలో ముందున్నాయని తెలిపారు. యువతరానికి తగిన శిక్షణ ఇస్తే సొంతంగా నిలబడతారని సృష్టం చేశారు. ఐటీఐలు ఖాళీగా ఉండటం దురదృష్టకరమన్నారు. ఐటీఐల్లో అధునాతన కోర్సులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేయాలని వెంకయ్య సూచించారు.








