ట్రంప్ నిర్ణయాలతో ఐటీ ఉద్యోగులకు ముప్పు
ఐటీ రంగంలో కొత్త నియామకాల జోరు తగ్గింది. ఉన్న ఉద్యోగాలకు ముప్పు వచ్చి పడుతోంది. ప్రాజెక్టుల్లేవంటూ కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకిచ్చే సేవల్లో క్రమంగా కోత పెడుతున్నాయి. నగరంలోని కొన్ని కంపెనీలు ఇప్పటికే క్యాబ్ సేవలను నిలిపేశాయి. ఇంకేం వినాల్సి వస్తుందోనని వేతన జీవులు ఆందోళన చెందుతున్న దశలో, హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగాల్లో కోతలు మొదలయ్యాయి. కాగ్నిజెంట్ లో ఒకేసారి భారీస్థాయిలో ఉద్యోగాల తొలగింపు వివాదం కార్మికశాఖకు చేరింది. ఓవైపు ఐటీ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు భయపెడుతున్నాయి. మరోవైపు ఈ రంగంలో యాంత్రీకరణ (ఆటోమేషన్) వేగంగా విస్తరిస్తుండటం మానవ వనరులకు సవాళ్లు విసురుతోంది. ఎప్పటికప్పుడు సాంకేతికత మారిపోతుండటంతో, ఇప్పుడున్న ఐటీ ఉద్యోగుల్లో 39 లక్షల మంది నైపుణ్యాలు వచ్చే నాలుగేళ్లలో అక్కరకు రాకుండా పోతాయని అంతర్జాతీయ కన్సల్టెన్సీ మెకిన్సీ ఇటీవల తన నివేదికలో పేర్కొంది.








