డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం: సిఎం రేవంత్ రెడ్డి
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం హడావుడి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీలిమిటేషన్ (Delimitation) పై రేవంత్ రెడ్డి మాట్లాడారు. వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లు మరియు లోక్ సభ (Lok Sabha) సీట్ల పెంపును ఒకటిగా చూపిస్తూ ప్రతిపక్షాలు సహకరించడం లేదని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)కు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన రెండు వేర్వేరు అంశాలని, వాటిని విడిగా చర్చించి అమలు చేయాలని సూచించారు. జనాభా ఆధారంగా లోక్సభ సీట్లు పెంచితే దక్షిణాది మరియు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. కుటుంబ నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదల తగ్గించుకున్నాయని, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా పెరిగిందని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సీట్ల పునర్విభజనలో జనాభా మాత్రమే కాకుండా రాష్ట్రాల స్థూల దేశీయ ఉత్పత్తి (జీడిపి) ఆధారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. పెంచబోయే సీట్లలో కొంత భాగం ప్రొరేటా విధానంలో, మిగతా భాగం ఆర్థిక ప్రాతిపదికన కేటాయించాలని ఆయన ప్రతిపాదించారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరిపి, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. హడావుడిగా నిర్ణయం తీసుకుంటే దేశంలో ఉత్తరాది – దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి








