Harish Vs Revanth: హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్!
సిద్ధిపేటపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. దశాబ్దాలుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న సిద్దిపేటలో, హరీష్ రావు జైత్రయాత్రకు బ్రేక్ వేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. కేవలం విమర్శలతో సరిపెట్టకుండా, ఈసారి ఏకంగా మంత్రి పదవి ఆఫర్ చేశారు.
సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దశాబ్దాలుగా సిద్దిపేట ఒకే కుటుంబం చేతిలో ఉందని, ఈ ఏకఛత్రాధిపత్యానికి స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, ఆ గెలిచిన వ్యక్తిని నేరుగా క్యాబినెట్ మంత్రిని చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
సిద్దిపేటలో హరీష్ రావు తిరుగులేని నాయకుడు. ఆయన అభివృద్ధి ప్రదాతగా పేరు తెచ్చుకున్నారు. అయితే హరీశ్ రావును ఓడించడం ద్వారా నియోజకవర్గంపై పట్టు సాధించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. హరీశ్ రావు గెలిచినా ఎమ్మెల్యేగా ఉంటారని, అదే కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మీ నియోజకవర్గానికి మంత్రి అవుతారని ఆశ చూపించారు. తద్వారా ఓటర్ల ఆలోచనా దృక్పథంలో మార్పు తేవాలని రేవంత్ భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సిద్దిపేటలో హరీష్ రావు చేసిన అభివృద్ధిని కాదనలేం. అందుకే రేవంత్ రెడ్డి తన పర్యటనలో దాదాపు రూ. 775 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజీ పనులు, సాగునీటి ప్రాజెక్టుల హామీల ద్వారా.. “అభివృద్ధి అనేది కేవలం ఒక వ్యక్తి వల్లే జరగదు, ప్రభుత్వ తలుచుకుంటే అంతకంటే ఎక్కువ చేయగలదు” అనే సంకేతాన్ని పంపారు.

రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో “ఒక్క అవకాశం ఇవ్వండి” అనే నినాదాన్ని బలంగా వినిపించారు. 2023లో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మార్పును సిద్దిపేటలో కూడా తీసుకురావాలని ఆయన కోరారు. దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి వంటి సీనియర్ నేతలను సాక్షిగా పెట్టి ఈ మంత్రి పదవి హామీ ఇవ్వడం గమనార్హం. ఇది కేవలం ఎన్నికల హామీ మాత్రమే కాదు, సిద్దిపేట కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం కూడా.
అయితే రేవంత్ రెడ్డి ప్లాన్ ఎంతమేరకు వర్కవుట్ అవుతుందనేది ఆసక్తికరం. హరీష్ రావుకు సిద్దిపేట ప్రజలతో ఉన్న బంధం విడదీయలేనిది. ఆయన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంపై, ప్రతి ఓటరుపై పట్టు కలిగి ఉన్నారు. కేవలం మంత్రి పదవి ఆశ చూపి ఆ బంధాన్ని తెంచడం అంత సులభం కాదు. వరుసగా ఒకే వ్యక్తిని గెలవడం వల్ల నియోజకవర్గంలో కొంతవరకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత కొత్త నాయకత్వాన్ని కోరుకునే ఛాన్స్ ఉంది. రేవంత్ రెడ్డి సరిగ్గా ఆ పాయింట్‌నే టార్గెట్ చేస్తున్నారు. 2029 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉంటే, అధికార పార్టీ వైపు మొగ్గు చూపే ఓటర్లను ఈ ‘మంత్రి’ ఆఫర్ ఆకర్షించవచ్చు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన ఈ సవాల్ హరీష్ రావుకు ఒక హెచ్చరిక లాంటిది. సిద్దిపేట గడ్డపై బీఆర్ఎస్ జెండాను దించి, కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి రేవంత్ అభివృద్ధి + అధికారం అనే రెండంచుల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి.
ఇవి కూడా చదవండి








