ఈ నెల 27న విజయవాడకు సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయవాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 27న ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని ముఖ్యమంత్రి మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి తెలంగాణ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, స్వర్ణపత్రాలు, తిరుమల వెంకన్నకు స్వర్ణ సాలిగ్రామహారం, స్వర్ణ కంఠాభరణాలు, కురవి వీరభద్రుడికి బంగారు మీసం సమర్పించిన విషయం విదితమే. తెలంగాణ ఉద్యమం సమయంలో దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులను కేసీఆర్ వరుసగా తీర్చుకుంటున్నారు. ఇక తన విజయవాడ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ భేటీ కావచ్చని తెలుస్తోంది.








