కేసీఆర్ ఆపరేషన్ ‘హరీష్’ … టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది..!
ప్రత్యేక తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేవరకు కేసీఆర్ ప్రస్థానంలో ఆయన మేనళ్లుడు, మంత్రి హరీష్‌రావు పాత్ర వెలకట్టలేనిది. అనుక్షణం హరీష్ మేనమామ కేసీఆర్‌కు వెన్నంటే ఉన్నారు. టీఆర్ఎస్ మొక్క స్థాయి నుంచి మానుగా ఎదిగేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. 2014 ఎన్నికల ముందు వరకు కేసీఆర్ తర్వాత అంతటి పలుకుబడి ఉన్న హరీష్ తెలంగాణ ఏర్పాటు తర్వాత కీలకమైన ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల చేత నీరాజనాలు కూడా అందుకుంటున్నారు. అలాంటి హరీష్‌ను ఇప్పుడు పార్టీలో అణగదొక్కే ప్రక్రియ ప్రారంభమైందా ? అంటే అవుననే ఆన్సర్లే పార్టీలోనే వినిపిస్తున్నాయి.
మూడేళ్ల వరకు..ఇంకా చెప్పాలంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరేడు నెలల వరకు కూడా ఎక్కడ సమస్యలు వచ్చినా….ట్రబుల్ షూటర్‌గా రంగంలోకి దిగి అన్నీ చక్కబెట్టే బాధ్యత. అయితే ఇప్పుడు కేసీఆర్ హరీష్‌ను టార్గెట్ చేసేందుకు ఆపరేషన్ హరీష్ స్టార్ట్ చేశారన్న ఊహాగానాలు…కాదు కాదు బలమైన ఆధారాలతో కూడిన వార్తలే టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు పార్టీ సమాయత్తం అవుతున్న తరుణంలో తన కుమారుడు మంత్రి కేటీఆర్‌ను పార్టీలొ మరింతగా ప్రమోట్ చేసేందుకు కేసీఆర్ వేసిన ప్లాన్‌లో భాగంగానే హరీష్‌ను తొక్కేస్తున్నట్టే కనిపిస్తోంది.
ఇటీవల జరిగిన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో కూడా గులాబీబాస్ హరీష్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం కూడా పార్టీ శ్రేణుల్లోనే పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఈ ఒక్క అంశంమే కాదు ఇటీవల భూ సర్వే కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో హరీష్‌రావు వ్యవహారంపై కేసీఆర్ ఓపెన్‌గానే తన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక గత రెండేళ్లలో తెలంగాణలో జరిగిన పలు ఎన్నికల బాధ్యతలను కూడా కేసీఆర్ హరీష్‌కు కాకుండా తన కుమారుడు కేటీఆర్‌కే అప్పగించారు. అక్కడ గెలుపు క్రెడిట్ సహజంగానే కేటీఆర్ అక్కౌంట్లోకి వెళ్లిపోయింది.
ఇక పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్నా హరీష్ వర్గంగా ముద్రపడిన వారికి మాత్రం ఎలాంటి పదవులు రావడం లేదు. అదే కేటీఆర్ వర్గంగా ఉంటే చాలు వాళ్లు పార్టీలోకి ఎప్పుడు వచ్చినా సరే వారికి కీలక పదవులు వచ్చేస్తున్నాయి. ఇక కేసీఆర్ పార్టీ పగ్గాలు తన కుమారుడు కేటీఆర్‌కు అప్పగించే క్రమంలోనే హరీష్‌ను వెనక్కినెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టే కనపడుతోంది. ఇదంతా గమనిస్తోన్న హరీష్ లోలోపల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. పార్టీలో తనకు ప్రయారిటీ తగ్గిన పక్షంలో ఆయన రాజకీయంగా కొత్తదారులు వెతుక్కునేపనిలో కూడా పడినట్టు టాక్.
ఈ తంతు ఇలా ఉండగా ఇటీవల టీ కాంగ్రెస్ లీడర్ భట్టి విక్రమార్క్ హరీష్‌రావుతో పాటు ఏడెనిమిది మంది మంత్రులు తమతో టచ్‌లో ఉన్నారని, వీరంతా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లోకి వస్తారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రస్తుతానికి హరీష్ అండ్ టీం సైలెంట్‌గానే ఉన్నా.. వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోన్నన్న ఆందోళనలు టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.













