సీఎం కేసీఆర్ మానవత్వం : చిన్నారి వైద్యానికి రూ.25లక్షలు
కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం ఉన్న పేద బాలుడికి సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం మంజూరు చేశారు. గజ్వేల్ పట్టణానికి చెందిన హనుమాన్ దాస్ కుమారుడైన దేవసాని శ్రీమాన్ (11 నెలలు) పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేయించగా కాలేయానికి సంబంధించిన సమస్య తలెత్తిందని, కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని వైద్యులు చెప్పారు. అంత ఖర్చు భరించలేని తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
ఈ విషయాన్ని పత్రికల్లో వచ్చిన కథనాల ద్వారా సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. వెంటనే సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డితో మాట్లాడారు. వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి బాలుడి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలేయ మార్పిడికి రూ.25 లక్షలు ఖర్చవుతుందని వైద్యలు చెప్పారు. ఈ మొత్తం డబ్బును ముఖ్యమంత్రి కేసీఆర్.. తన సహాయనిధి నుంచి మంజూరు చేశారు. ఈ చెక్కును ఆస్పత్రి యాజమాన్యానికి అందించారు కలెక్టర్.








