Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి సీఐడీ సెగ!
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో పోలీసులతో జరిగిన వాగ్వాదం, ఉన్నతాధికారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు ఆయనను సీఐడీ కార్యాలయం మెట్లు ఎక్కించేలా చేసింది. తాజాగా తెలంగాణ సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 4న హైదరాబాద్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
ఈ ఏడాది జనవరి 29న హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంకలో మినీ మేడారం జాతర సందడి జరిగింది. తన నియోజకవర్గంలోని ప్రజలతో కలిసి జాతరలో పాల్గొనేందుకు కౌశిక్ రెడ్డి తన కుటుంబంతో సహా బయలుదేరారు. అయితే, భద్రతా కారణాలు లేదా ఇతర రాజకీయ కారణాల రీత్యా పోలీసులు ఆయనను మార్గమధ్యలోనే అడ్డుకున్నారు.
తన సొంత నియోజకవర్గంలో, కుటుంబంతో కలిసి జాతరకు వెళ్తున్న తనను అడ్డుకోవడంపై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో ఆయనకు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆవేశంలో ఆయన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను ఉద్దేశించి వ్యక్తిగత, మతపరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా, ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ దృష్టికి వెళ్లాయి. ఉన్నతాధికారి మతాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేయడంపై అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి
పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, ఉన్నతాధికారులను దూషించడం వంటి సెక్షన్ల కింద అప్పట్లోనే కేసు నమోదైంది. ఈ కేసును ప్రభుత్వం సీఐడీ విచారణకు అప్పగించింది. ఇప్పుడు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఏప్రిల్ 4న రావాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని సీఐడీ అధికారులు ఆదేశించారు.
సీఐడీ నోటీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేశారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. “రేవంత్ రెడ్డి గారు… నన్ను లక్ష్యంగా చేసుకోండి, నాపై ఎన్ని కేసులైనా పెట్టండి, నోటీసులు ఇవ్వండి. కానీ నా కుటుంబాన్ని, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఈ గొడవల్లోకి లాగి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం?” అని ఆయన ప్రశ్నించారు. తాను నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతోనే, పాత కేసులను తిరగదోడి వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కానీ, బయట కానీ ప్రజల పక్షాన గొంతు ఎత్తుతున్నందుకే ఈ నోటీసులని ఆయన అభివర్ణించారు.
ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అరెస్టులు చేసినా తాను భయపడే ప్రసక్తే లేదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. “ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రజల కోసం చేస్తున్న పోరాటం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాను” అంటూ అధికార పక్షానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రశ్నించే గొంతును అణచివేయలేరని, ప్రజల పక్షాన తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన ఘంటాపథంగా చెప్పారు.
ఏప్రిల్ 4న కౌశిక్ రెడ్డి సీఐడీ విచారణకు హాజరవుతారా? లేదా గడువు కోరతారా? అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అధికార పార్టీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటుంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఇది రాజకీయ వేధింపులేనని మండిపడుతోంది. ఏది ఏమైనా, హుజూరాబాద్ టైగర్‌గా పేరు తెచ్చుకున్న కౌశిక్ రెడ్డికి ఈ సీఐడీ నోటీసులు ఒక సవాలుగానే మారాయి.
ఇవి కూడా చదవండి








