Padi Kaushik Reddy: బీఆర్ఎస్కు భారంగా మారుతున్న కౌశిక్ రెడ్డి..?
తెలంగాణ రాజకీయాల్లో ‘ఫైర్ బ్రాండ్’ అనిపించుకోవాలని ఆశపడే నాయకులు చాలామంది ఉంటారు. కానీ, ఆ దూకుడు హుందాతనాన్ని దాటి వివాదాలకు దారితీస్తే.. అది సదరు నాయకుడికే కాదు, పార్టీకి కూడా తీరని నష్టం కలిగిస్తుంది. ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన నాటి నుండి నేటి వరకు ఆయన ప్రస్థానం విజయాల కంటే వివాదాలతోనే ఎక్కువగా సాగుతోంది.
తాజాగా అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతుండగా, కౌశిక్ రెడ్డి తుపాకీతో కాల్చిపడేస్తానంటూ చేసిన సైగలు పెను దుమారం రేపాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, సభలోనే తోటి సభ్యునిపై ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నక్సలైట్ గా అభివర్ణించే వరకు పరిస్థితి వెళ్లిందంటే, ఆయన తీరు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయనపై చర్యల నిమిత్తం ఎథిక్స్ కమిటీ రంగంలోకి దిగడం, సభ్యత్వంపై వేటు పడే అవకాశం ఉండటం బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసింది.
కౌశిక్ రెడ్డికి వివాదాలు కొత్త కాదు. గత రెండేళ్లలో ఆయన అనేకి వివాదాల్లో చిక్కుకున్నారు. 2024లో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపై అనుచిత ప్రవర్తనతో కేసు నమోదైంది. అలాగే సమ్మక్క సారక్క జాతరలో ఒక పోలీస్ అధికారిని మతం పేరుతో దూషించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భార్య పుట్టినరోజు సందర్భంగా పవిత్రమైన యాదాద్రి ఆలయంలో ఫొటో షూట్ నిర్వహించి సోషల్ మీడియాలో పెట్టడం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. 2025లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో కలెక్టరేట్ సమావేశంలోనే గొడవకు దిగి, ఫిజికల్ అటాక్ చేశారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. జూన్ 1, 2025న ఒక గ్రానైట్ వ్యాపారిని రూ. 50 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలతో విదేశాలకు వెళ్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టై రిమాండ్‌కు వెళ్లారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను విమర్శించే క్రమంలో ఆయన వాడిన ‘చీర, గాజులు’ భాష మహిళా లోకాన్ని, రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
ఏ పార్టీకైనా దూకుడున్న నాయకులు బలం. కానీ, కౌశిక్ రెడ్డి విషయంలో ఆ దూకుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోంది. ఆయన చేసే వ్యాఖ్యలు, ప్రవర్తన వల్ల పార్టీ కేడర్‌లో జోష్ రావడం పక్కన పెడితే, సాధారణ ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందనేది వాస్తవం.
అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయంలో, వ్యక్తిగత ప్రవర్తన వల్ల బీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడుతోంది. సీనియర్లను గౌరవించకపోవడం వల్ల పార్టీలోని ఇతర నేతలతో సమన్వయ లోపం ఏర్పడుతోంది. నిరంతరం కేసులు, అరెస్టులు, క్షమాపణల చుట్టూ రాజకీయాలు తిరగడం వల్ల పార్టీ అజెండా పక్కకు వెళ్తోంది.
విమర్శించడం ప్రజాస్వామ్యంలో హక్కు, కానీ అది సభ్యతతో కూడి ఉండాలి. నోరు జారడం.. తర్వాత క్షమాపణలు చెప్పడం.. కౌశిక్ రెడ్డికి అలవాటుగా మారింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, ఆయన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుకే కాదు, బీఆర్ఎస్ పార్టీకి కూడా తీరని డ్యామేజ్ కలిగించే ప్రమాదం ఉంది. దూకుడుకు విజ్ఞత తోడవ్వకపోతే అది రాజకీయ ఆత్మహత్యే అవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.








