అంతర్జాతీయ స్థాయిలో మేడారం జాతర
గిరిజన సంప్రదాయానికీ నిలువెత్తు ప్రతిరూపమైన మేడారం సమ్మక్క, సారాలమ్మ జాతరను వచ్చే సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్నట్లు గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ వెల్లడించారు. వచ్చే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనున్న జాతర ఏర్పాట్లను సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతారని భావించి ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వివిధ రాష్ట్రాల గిరిజన, పర్యాటక శాఖ మంత్రులను, కార్యదర్శులను ఈ జాతరకు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆసియా దేశాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తామని చెప్పారు. అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా గిరిజన విశ్వసాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లను ప్రతిబింభించే విధంగా ప్రత్యేక ప్రదర్శలను నిర్వహించనున్నట్లు తెలిపారు.








