తెలంగాణలో ఘనంగా భోనాల ఏర్పాట్లు
తెలంగాణాకే కాకుండా భారతదేశానికి ఆదర్శంగా నిలిచే హైదరాబాద్ బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఆషాడమాసంలో నిర్వహించే బోనాల్లో మొట్టమొదటి ఈ నెల 25న గొల్కొండ జరిగే జగదాంబికా అమ్మవారి భోనాలు ఏర్పాట్లును వివిధ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ గడిచిన మూడు సంవత్సరాలుగా తెలంగాణ, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే హైదరాబాద్ బోనాల పండగను ఆర్ అండ్ బి, పోలీసు, రెవెన్యూ, విద్యుత్, దేవాదాయ, జిహెచ్ఎంసీ, ఆర్టీసి, సాంస్కృతిక తదితర శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ సారి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అంతే ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జూన్ 25న గొల్కొండ కోటలో మొదలయ్యే బోనాలు, సికింద్రబాద్ ఉజ్జయినీ మహంకాళీ, పాతబస్తీ, సింహవాహిని అమ్మవారి బోనాల జాతరతో ముగుస్తుందన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటా అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలన్నారు.








