హైదరాబాద్ ను మరచిపోలేను… అమెరికన్ యాత్రికుడు
వీసా, పాస్ పోర్టులు, డబ్బులు, ఫోన్ ఇతర సామగ్రిని కోల్పోయి హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతున్న అమెరికన్ పర్యాటకుడు జాన్ఫ్రీజర్ తాను మరికొన్ని రోజులు ఇక్కడే ఉంటానని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకుంటానని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు తెలిపారు. రైళ్లో ప్రయాణిస్తూ బ్యాగ్‌ను కోల్పోయి, బేగంపేట రైల్వేస్టేషన్ వద్ద దిగి అక్కడి జీహెచ్ఎంసీ భవనంలో ఆశ్రయం పొందిన జాన్‌ను వెంకటేశం సచివాలయంలోని తన కార్యాలయానికి పిలిపించారు. ఈ సందర్భంగా అతనితో మాట్లాడి పూర్వాపరాలు తెలుసుకున్నారు. అతన్ని అమెరికా పంపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ అధికారులు, ఢిల్లీలోని భారతరాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారని చెప్పారు. తనకు ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్‌ను మరిచిపోలేనని, ఇక్కడి అధికారులు, ప్రజల ఆదరణ అద్భుతమని జాన్ తెలిపారు. జాన్ ప్రీజర్కు పర్యాటక శాఖ తరపున వాహనాన్ని, సిబ్బందిని సమకూర్చారు.








