డ్రింకింగ్ వాటర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ
రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఆపరేషన్ మ్యాన్యువల్స్ రూపొందించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత నీటిని మిషన్ భగీరథకు వినియోగించాలో మదింపు చేయాలన్నారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని యావత్ రాష్ట్రం అవసరాలను తీర్చడానికి డ్రింకింగ్ వాటర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే సాగునీటి ప్రాజెక్టుల నుంచి విద్యుదుత్పత్తికి ఎంత నీరు అవసరమో అంచనా వేసి పవర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. ప్రగతి భవన్లో మంగళవారం నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సిఎం సమావేశమయ్యారు. గోదావరి, కృష్ణా నదుల ద్వారా అందుబాటులోకి వచ్చే జలాలను మంచినీరు, సాగునీరు, విద్యుత్, పారిశ్రామిక అవసరాలకు ఎంతమేరకు అవసరమో ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గోదావరి, కృష్ణా నదులపై అనేక ప్రాజెక్టులు కడుతున్నాం. ఈ రెండు నదుల నీటితో రైతులకు సాగునీరు అందించడంతో పాటు మంచినీటికి, పరిశ్రమల అవసరాలకు, విద్యుదుత్పత్తికి సరఫరా చేస్తున్నామన్నారు. ఏ రంగానికి ఎంత మేరకు నీరు అవసరమో స్పష్టత ఉండాలన్నారు.








