డ్రగ్స్ మహమ్మారికి అసలైన హీరో
అకున్ సబర్వాల్, ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. అతని దృష్టిలో తప్పు చేసిన వాళ్లే తప్ప సినీ ప్రముఖులు, సామాన్యులు అన్న భేదం లేదు. అక్రమార్కుల గుండెళ్లో నిద్రపోతూ, మత్తుగాళ్లకు కిక్కు దిగేలా చేస్తున్న అకున్ సబర్వాల్ గురించే ఇప్పుడు అన్ని చోట్లా డిస్కషన్. డ్రగ్స్ దందాను బయటపెట్టి, మత్తులో ఊగుతున్న గొప్పింటి కుర్రాళ్ల వంకరపోకడలను సరిచేసేందుకు నడుం బిగించిన ఈ మొనగాడు ఎవరు? గతంలో కూడా చాలా మంది అధికారులు ఇలాంటి అన్యాయాలను, అక్రమాలను ఎదిరించారు. కానీ పట్టు వదిలేశారు. అకున్ మాత్రం బెదరలేదు. కేసును వదిలేయాలని ఎంతమంది ఒత్తిడి చేసినా, లొంగలేదు. ఆయన ఎఫెక్ట్ సినిమా ఫీల్డ్ కే కాక, హైదరాబాద్ లో తప్పుడు పనులు చేస్తున్న చాలామందికి తగిలింది. అసలింతకీ ఎవరీ సబర్వాల్..? ఏంటి ఆయన కథ..?
అకున్ ఒక డెంటిస్ట్. ఆయన తండ్రి ఒక ఆర్మీ అధికారి. చిన్నతనం నుండే తన తండ్రిలాగే తాను కూడా దేశసేవ చేయాలనే ఇష్టం అధికంగా ఉండేది. ఆ ఇష్టంతోనే రాత్రింబవళ్లు కష్టపడి చదివి, 2001లో సివిల్స్ కు సెలక్ట్ అయ్యారు. ట్రైనింగ్ సమయంలో తన బ్యాచ్ మేట్ స్మితను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అకున్ ఫస్ట్ పోస్టింగ్ అస్సాంకు పడింది. అక్కడ తీవ్రవాద దాడులకు వ్యతిరేకంగా పోరాడారు. అనంతరం అనంతపురంలో బాధ్యతలు తీసుకుని, అక్కడ ఫ్యాక్షనిస్టుల మెడలు వంచారు. ఆయన అనంతపురంలో ఉన్నంత కాలం, ఫ్యాక్షన్ గొడవలు చాలా వరకూ తగ్గిపోయాయి. వరంగల్ లో ఓఎస్డీ గా చేస్తూ నక్సల్స్ నిర్మూలనకు కృషి చేశారు. అయితే, మావోయిస్టుల నుంచి ఆయనకు గట్టి ప్రతిఘటన విశాఖ జిల్లా ఎస్పీగా చేస్తున్న సమయంలో ఎదురైంది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య రమారమి 28 సార్లు ఎదురుకాల్పులు జరగడం చూస్తే, ఆయన ఈ ఇష్యూను ఎంత సీరియస్ గా హ్యాండిల్ చేశారన్న విషయం అర్ధమవుతుంది.
ఆ తర్వాత ఆయనకు హైదరాబాద్ డిసీపీగా ట్రాన్స్ ఫర్ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సబర్వాల్ దంపతుల నిజాయితీని పూర్తిగా విశ్వసించడం విశేషం. ఈ కారణంగానే అకున్ సబర్వాల్ కు ఎక్సైజ్ శాఖ అప్పగించారు. కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ, తెలంగాణలో గుడుంబా వాడకాన్ని చాలా వరకూ నిర్మూలించగలిగారు అకున్. తాజాగా ఆయన కన్ను డ్రగ్స్ రవాణా పై పడింది. హైదరాబాద్ లో నడుస్తున్న డ్రగ్స్ దందా ముఠా గుట్టు రట్టు చేసే బాధ్యతను తన భుజంపై వేసుకుని విజయవంతమయ్యారు. ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా సినీ ప్రముఖుల్ని వణికించారు అకున్.
అకున్ కంటే ముందే ఆయన భార్య పేరు కొన్నాళ్ల క్రితం బాగా వినబడింది. ఆమె మరెవరో కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయపు అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్. తెలంగాణ ఉద్యమసమయంలో స్మిత మెదక్ జిల్లా కలెక్టర్ గా చేశారు. మహిళలు పరిస్థితి చూసి ఆమె చలించిపోయిన విధానం, అప్పట్లో ఆమెకు ఎంతో మందిని అభిమానులుగా మార్చింది. ఆమె సిన్సియారిటీ గమనించిన తర్వాతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ తర్వాతి కాలంలో స్మితా సబర్వాల్ ను క్యాంప్ ఆఫీస్ లో అడిషనల్ సెక్రటరీగా నియమించారు. అకున్, స్మిత దంపతులకు ఇద్దరు పిల్లలు. వాళ్లను కూడా తమలాగే దేశసేవ కోసమే పనిచేసేలా పెంచుతున్నారు. ఈ దంపతులు మరింత మందికి ఆదర్శం కావాలి. మనం స్ఫూర్తి పొందడానికి ఎక్కడి నుంచో మహాత్ములు రారు. మన మధ్యే ఉంటారు. హ్యాట్సాఫ్ టు అకున్ అండ్ స్మితా సబర్వాల్..!













