21 ఏండ్లలో రూ.21 కోట్ల సంపాదన
ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బూర జ్యోతికిరణ్
ఆబ్కారీశాఖలో చేరిన 21ఏండ్లకే రూ.21 కోట్లు సంపాదించి అవినీతి వలలో చిక్కుకున్న అధికారి లీలలు మంగళవారం బట్టబయలయ్యాయి. 1996లో ఆబ్కారీశాఖలో సీఐగా ఉద్యోగంలో చేరిన బూర జ్యోతికిరణ్ అంచెలంచెలుగా ఎదిగి ఇటీవలే నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఆయన ఇండ్లపై ఏసీబీ బృందాలు ఏకకాలంలో దాడులు చేసి రూ. 4 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నాయి. వీటి విలువ బయటి మార్కెట్లో రూ.21కోట్ల వరకు ఉంటుందని అంచనా. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారిగా ఆబ్కారీశాఖలో ఏసీబీ దాడులు జరుగడంతో కలకలం రేగింది. డీఎస్పీలు అశోక్‌కుమార్, రవికుమార్, శ్రీనివాసులు, ప్రభాకర్, పదిమంది ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పడిన ఆరు బృందాలు మంగళవారం ఏకకాలంలో సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో సోదాలు చేశాయి. ఆదాయానికి మించి ఉన్న ఆస్తుల దస్తావేజులు స్వాధీనం చేసుకున్నాయి. సోదాల్లో 30ఎకరాల వ్యవసాయ భూమి, రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు, ఇల్లు, 16చోట్ల స్థలాలు, కిలో బంగారు నగలు, బ్యాంక్ డిపాజిట్లు, వాహనాలు, లక్షల విలువైన షేర్లు బయటపడ్డాయి.
దొందూ దొందే
తండ్రి బాటలో తనయుడు: జ్యోతికిరణ్ తండ్రి బూర సత్యారావు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేశారు. ఆ సమయంలో జారీ చేసిన లోన్ (అప్పులు)లలో మోసాలు జరుగడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు కూడా ఫిర్యాదులు అందడంతో 2011లో సీబీఐ అతడిపై కేసు నమోదుచేయగా, ఈ కేసు కోర్టు విచారణలో ఉన్నది.








